బంగ్లాలో రాముడి భారీ విగ్రహ నిర్మాణానికి బ్రేక్.. ఇస్లామిక్‌ అతివాదుల ఒత్తిడే కారణమా?

  • ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేత
  • ఇస్లామిక్‌ సంస్థల ఒత్తిడి కారణమని ఆరోపణలు
  • ఆందోళన వ్యక్తం చేసిన తస్లీమా నస్రీన్‌
  • బంగ్లాలో హిందూ మైనారిటీల భద్రతపై చర్చ
  • మత స్వేచ్ఛపై ప్రశ్నలు
బంగ్లాదేశ్‌లో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముడి విగ్రహ పనులను అక్కడి అధికారులు నిలిపివేశారు. గైబాంధా జిల్లాలోని పలాష్‌బారి ప్రాంతంలోని శ్రీశ్రీ రాధా గోవింద, కాళీ ఆలయ ప్రాంగణంలో ఈ భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. అయితే స్థానిక ఇస్లామిక్‌ సంస్థలు, మత ఛాందసవాద గ్రూపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.

ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అక్కడి హిందూ మైనారిటీల హక్కులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని మతపరమైన సంస్థలు నిరసనలు చేపట్టడం, కఠిన వ్యాఖ్యలు చేయడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ప్రవాస బంగ్లాదేశ్ రచయిత్రి, మానవ హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండించారు. ‘‘బంగ్లాదేశ్‌లో లక్షలాది మసీదులు ఉన్నాయి. కొత్త వాటి నిర్మాణం కూడా కొనసాగుతోంది. అలాంటప్పుడు ఒకే ఒక్క రామాలయం లేదా రాముడి విగ్రహ నిర్మాణంపై ఎందుకు ఇంత వ్యతిరేకత?’’ అని ప్రశ్నించారు. మత స్వేచ్ఛ అందరికీ సమానంగా వర్తించాలని, అది కేవలం మెజారిటీ వర్గానికే పరిమితం కాకూడదని ఆమె పేర్కొన్నారు.

పలాష్‌బారి ప్రాంతంలో గతంలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరిగిన ఘటనలను గుర్తు చేసిన తస్లీమా నస్రీన్‌ తాజా పరిణామం హిందూ మైనారిటీల భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇండోనేషియా, యూఏఈ, మలేషియా, ఒమన్‌ వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో కూడా భారీ హిందూ దేవాలయాలు ఉన్నాయని, అక్కడ వాటిని ఎవరూ దేశానికి ముప్పుగా చూడరని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో బంగ్లాదేశ్‌ పత్రిక ‘బ్లిట్జ్‌’ సంపాదకుడు సలాహుద్దీన్ షోయబ్ చౌధురి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక జిహాదీ, ఇస్లామిక్‌ అతివాద గ్రూపుల నిరసనల కారణంగానే రాముడి విగ్రహ నిర్మాణాన్ని నిలిపివేసినట్లు ఆయన ఆరోపించారు.

Lord Rama Statue
Bangladesh
Taslima Nasreen
Hindu Minorities
Islamic Extremists
Gaibandha

More Telugu News